రోజాకు బ్రాహ్మ‌ణి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌..

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తుంద‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో వ‌స్తున్నాయి. ఇక రాజ‌కీయంగా బ్రాహ్మ‌ణి అప్పుడే పొలిటిక‌ల్ కారిడార్‌లో స‌ర్యూట్ అయిపోతున్నారు. త‌న మామ చంద్ర‌బాబు, భ‌ర్త లోకేశ్‌పై రాజ‌కీయంగా ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా, త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా ఆమె మాత్రం లైట్ తీస్కొంటున్నారు. రాజకీయ అంశాలు తన దగ్గరకు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
అలాంటి ఆమె తాజాగా రాజకీయ విమర్శలపై పెదవి విప్పారు. ఇటీవ‌ల ఓ వాహ‌నంలో అక్ర‌మంగా ఎర్ర‌చంద‌నం త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే ఆ త‌ర్వాత ఆ వాహ‌నం హెరిటేజ్‌ది కాద‌ని పోలీసులు తేల్చారు. ఈ ఎర్ర‌చంద‌నం విలువ రూ. 5 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని కూడా తేలింది. ఈ  ఉదంతంపై వైసీపీ ఫైర్‌బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.
రోజా విమ‌ర్శ‌ల‌పై నారా బ్రాహ్మ‌ణి స్పందించారు. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం అంటూ చేస్తున్న విమర్శలపై స్పష్టత ఇవ్వటంతో పాటు.. కంపెనీని బ‌ద్నాం చేయాల‌ని చూస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రిస్తూ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. ఎర్ర‌చంద‌నం దుంగ‌ల త‌ర‌లింపున‌కు త‌మ కంపెనీ వాహ‌నానికి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పిన బ్రాహ్మ‌ణి, ఆధారాలు లేని విమ‌ర్శ‌లు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.
హెరిటేజ్ ప్రతిష్ట దెబ్బ తినేలా ఆరోపణలు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెరిటేజ్ మీద రాజకీయ వ్యాఖ్యల్ని వదిలే ప్రసక్తే లేదన్న విషయాన్ని బ్రాహ్మణి తనదైన స్టైల్లో దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మరి బ్రాహ్మ‌ణి కౌంట‌ర్ ఎటాక్‌కు రోజా నుంచి ఎలాంటి రిప్లే వ‌స్తుందో చూడాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *