కొత్త నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ఉమా..!

ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుటి నుంచే వచ్చే ఎన్నికల భయం పట్టుకున్నట్లుంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నట్టు తాజా స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. చంద్ర‌బాబు స‌ర్వేల్లో మంత్రిగా మంచి మార్కులే వేయించుకున్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌ట్టు తేలింద‌ట‌.
ఇలా ఒక‌సారి కాదు రెండుసార్లు బాబు స‌ర్వేలో మైల‌వ‌రంలో ఉమాకు తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మైంద‌ట‌. ఇక గ‌తంలో రెండుసార్లు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009లో నందిగామ ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో ప‌క్క‌నే ఉన్న మైల‌వ‌రంకు మారారు. మైల‌వ‌రంలో రెండుసార్లు గెలిచిన ఉమా అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చేసిందేమి లేక‌పోవ‌డంతో పాటు త‌ర‌చూ నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డంతో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త బాగా పెరిగిపోయిన‌ట్టు తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో తనకు మైలవరం సేఫ్ కాదని ఉమ గుర్తించారు. జలవనరుల శాఖ మంత్రిగా ఉండటంతో బిజీ ఉండే ఉమ నియోజకవర్గం వైపు వెళ్లడంకూడా కష్టంగానే మారింది. జిల్లాను శాసించే ఉమ మైలవరం నియోజకవర్గం మీద మాత్రం పట్టు సాధించలేకపోయారు. దీంతో ఆయ‌న ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారా ? అన్న‌దే స‌స్పెన్స్‌గా మారింది.
నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి నందిగామ జ‌న‌ర‌ల్ అయితే ఉమా గారెల బుట్ట‌లో ప‌డిన‌ట్టే. లేనిప‌క్షంలో ఇబ్ర‌హీంప‌ట్నం లేదా విజ‌య‌వాడ రూర‌ల్ కేంద్రంగా కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తే ఉమా అక్క‌డ నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు. ఒక వేళ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌క‌పోతే ఉమాకు మైల‌వ‌రంలో గెలుపు క‌ష్టం. అప్పుడు ఉమాకు ఉన్న ఆప్ష‌న్ నూజివీడు. ఈ క్ర‌మంలోనే ఉమా నూజివీడుపై కూడా ఓ క‌న్నేసి ఉంచిన‌ట్టు తెలుస్తోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *