బాబూ.. చినబాబు అంత రిస్క్ ఎందుకు ..?
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి అమాంతం ధైర్యం వచ్చేసింది. ఇప్పటికే ఎమ్యెల్సీగా నామినేట్ అయ్యి మంత్రి పదవి లో కూర్చున్నప్పటి నుంచి ప్రతిపక్షాలతో పాటు సోషల్ మీడియాలో లోకేష్ మీద కౌంటర్ లు పడుతూనే ఉన్నాయి. చంద్రబాబు పాలనలో లోకేష్ కి మాత్రమే జాబ్ దొరికింది అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇక ఇటువంటి మాటలకు చెక్ పెట్టాలనుకున్నాడో ఏమో కానీ తాను రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ సవాల్ విసిరేసాడు.

అయితే లోకేష్ సవాల్ అయితే చేసాడు కానీ నిజంగా పోటీ చేస్తాడా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఇలాంటి ప్రశ్నలే లోకేష్ కు ఎదురైనప్పుడు “రాబోయే ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గాల్లో వారు బిజీగా ఉంటారు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవహారాలన్ని నేనే చూసుకోవాలి కాబట్టి.. ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగకపోవచ్చు” అని చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ… ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్తున్నాడు చినబాబు.లోకేష్ ఎన్నికల్లో పోటీ చేస్తా అనగానే టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలయ్యింది…అసలే లోకేషు.. పైగా ప్రస్తుత పార్టీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరెకత వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో లోకేష్ పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అని లెక్కలు వేసుకుంటున్నారు.

అసలు లోకేష్ కి మైక్ దొరికితే ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. బయట మైకుల ముందు మాట్లాడటం వల్ల జరిగిన నష్టం చాలు, తెచ్చుకున్న “ముద్దు పేరు” చాలు అని..బాబూ వార్నింగ్ ఇవ్వడంతో ట్విటర్ కే ఆయన పరిమితం అయిపోయాడు. ఎంత పెద్ద విషయం అయినా, ఎంత చిన్న విషయం అయినా.. లోకేష్ ట్విట్టర్ వేదికగానే స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో… సోషల్ మీడియాలో లోకేష్ చేసే ప్రతీ ట్వీట్ కు కింద కామెంట్స్ లో… ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచి మాట్లాడితె బాగుంటుంది అని కామెంట్స్ ఎక్కువగా వస్తుండడంతో హర్ట్ అయిన చినబాబు ఈ నిర్నయాయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సీఎం కుమారుడి హోదాలో లోకేష్ రంగంలోకి దిగితే ఖచ్చితంగా గెలవాలి అది కూడా భారీ మెజారిటీతో. అలా కానిపక్షంలో ఉన్న కాస్త పరువు కూడా పోతుంది.ఇక ఆయన కనుక ఆ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇక చెప్పేది ఏముంది ..! అందుకే ఎందుకొచ్చిన రిస్క్ చినబాబు హాయిగా దొడ్డిదారి ఉంది కదా మనకు అంటూ సలహాలు ఇస్తున్నారు టీడీపీ అభిమానులు.