నంద్యాల‌లో వైసీపీకి మ‌హేష్ ఫ్యాన్స్ స‌పోర్ట్‌..

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ ఎలా పోరాడుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ పోటీ చేస్తోన్న ఇద్ద‌రు అభ్య‌ర్తులు గెలుపుకోసం ఇప్ప‌టికే కులాల వారీగా మీటింగులు పెడుతున్నారు. రెడ్డి, ముస్లిం, వైశ్య‌, బీసీ, బోయ‌, వాల్మికీ, ఎస్సీ వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు.

ఇప్పటికే పలు సంఘాలను ఆకర్షిస్తున్న పార్టీలు…. ఇప్పుడు హీరోల సంఘాలను కలుపుకుపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ మ‌హేష్‌బాబు అభిమాన సంఘాల‌ను త‌న వైపున‌కు తిప్పుకుంది. సూపర్ స్టార్‌ కృష్ణ కుటుంబం తొలి నుంచి కూడా వైఎస్‌ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేది. ప్రస్తుతం కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆయ‌న గుంటూరు నుంచి ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అయితే 2014 ఎన్నికల్లో కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ నేరుగా టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడంతో కృష్ణ అభిమాన సంఘాలు తటస్థంగా ఉండిపోయాయి. ఇప్పుడు  నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం కృష్ణ, మహేష్‌ బాబు అభిమాన సంఘాలు వైసీపీకి మద్దతు తెలిపాయి.

మ‌హేష్‌బాబు అభిమాన సంఘాల నాయకులు,  సభ్యులతో నంద్యాలలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు కృష్ణ, మహేష్‌బాబు అభిమాన సంఘాలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపాయి.  తక్షణమే తాము నంద్యాలలో శిల్పామోహన్‌ రెడ్డి కోసం ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగుతున్నట్టు అభిమాన సంఘాల నాయకులు తెలిపారు. వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తమవంతుసాయం చేస్తామని వెల్లడించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *